December 10, 2016

శివకోడు

శివకోడు




ఈ ఆలయం రాజోలు నుండి పాలకొల్లు వెళ్ళే మార్గంలో జాతీయ రహదారి ప్రక్కన 2కిలోమీటర్ల దూరంలో ఉంది.  
శివకోడులో ఉన్న ఈ ఈశ్వర లింగాన్ని శ్రీఉమాశివలింగేశ్వర స్వామివారు అని అంటారు. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు బ్రహ్మహత్యా దోషం నివారణకుగాను కోటి శివలింగాలని ప్రతిష్టించాలని అనుకున్నాడు. హనుమంతుని సహాయంతో శ్రీరాముడు కోటి శివలింగాల్ని ప్రతిష్టించాడంట. ఈ గ్రామంలో ప్రతిష్టించిన శివలింగంతో సంఖ్యామానం ప్రకారం కోటి పూర్తి అయ్యింది. అందువల్ల ఈ ప్రదేశాన్ని శివకోటిగా పిలిచేవారు. క్రమంగా ఈ పేరు రూపాంతరం చెందుతూ ప్రస్తుతం శివకోడుగా పిలవబడుతోంది.

ఎక్కడా మనం కనీవినీ ఎరుగనట్లుగా, ఇక్కడ శివలింగం మనకు అర్ధనారీశ్వరునిగా దర్శనమిస్తుంది. ఎక్కడైనా అర్ధనారీశ్వరుడు అంటే శివపార్వతులు ఉంటారు కదా! కానీ ఇక్కడ ఈ శివలింగం యొక్క  ఎడమభాగంలో పార్వతీదేవి, కుడిభాగంలో గంగాదేవి ఉంటారు. గంగమ్మతల్లి ఉన్న ప్రాంతంలో శివలింగంపై అడుగు లోతులో నీరు వస్తుంటుందని, అంటే నీరు ఊరుతూ ఉంటుందని చెబుతుంటారు. ఈ శివలింగంలోనే ఇద్దరు అమ్మవార్లు ఉండటంవల్ల కుంకుమపూజలు కూడా శివలింగం దగ్గరే చేస్తుంటారట. శివలింగాన్నైతే మేం దర్శించుకున్నాం కానీ, లింగంపై ఉన్న ఇద్దరి అమ్మవార్లను దర్శించుకోలేకపోయాం. ఎందుకంటే ఎప్పుడుపడితే అప్పుడు అమ్మవార్లను మనం దర్శించుకోలేం. ప్రతీరోజు ఉదయం 7గంటలకు స్వామివారికి అభిషేకం చేస్తారంట. ఆ సమయంలోనే శివలింగంపై ఉన్న అమ్మవార్లను మనం దర్శించుకునే అవకాశం ఉంటుంది. మేం వెళ్లేసరికి సాయంత్రం 6.15 అయ్యింది. అందువల్ల మేం miss అయ్యాం. దూరం నుండే శివలింగాన్ని దర్శించుకొని వచ్చేసాం.                           
    

No comments:

Post a Comment