September 13, 2013

విజయదశమి (దసరా)

విజయదశమి (దసరా)  

ఏ పండుగ అయినా సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. కానీ అమ్మవారి పండుగ సంవత్సరానికి రెండుమార్లు వస్తుంది. ఎలాగ అంటే, ----చైత్రమాసంలో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంతనవరాత్రులు ఒకసారి...... ఆశ్వీయుజ మాసంలో పాడ్యమి నుండి విజయదశమి వరకు శరన్నవరాత్రులు మరొకసారి ..... జరుగుతాయి.

మాసాల్లో మొదటిది చైత్రమాసం, నక్షత్రాలలో మొదటిది అశ్విని. చైత్రమాసంలో నవరాత్రులను వసంతనవరాత్రులు అని, నక్షత్రాలలో మొదటిది అయిన అశ్విని ప్రధానంగా ఉండే ఆశ్వీయుజమాసంలో నవరాత్రులను శరన్నవరాత్రులు అని,  రెండుమార్లు నవరాత్రులను జరుపుకుంటాము. ఒకటి ఉత్తరాయణంలో ...... మరొకటి దక్షిణాయనంలో రావటం మరొక విశేషం.

మరో విశేషం కూడా ఉంది. చైత్రమాసపు నవరాత్రులు అశ్వినీ నక్షత్రంతో ప్రారంభమైతే, అశ్వినీ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండే ఆశ్వీయుజమాసపు నవరాత్రులు చిత్తా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. మరొక విశేషం ఏమిటంటే ...... నక్షత్రాలు 27 లో మొదటిది అశ్విని అయితే సరిగ్గా మధ్యగా వుండే నక్షత్రం చిత్త. అలాగే మాసాల్లో 12 లో మధ్యగా వుండే మాసం ఆశ్వీయుజం. ఆరింటిలో మొదటిది చైత్రమాసం అయితే..... మధ్యగా ఉండే మాసం ఆశ్వీయుజం...... అదే విధంగా ఋతువులలో మొదటిది వసంతమైతే ... మధ్యది శరదృతువు.

ఇది అంతా ఎందుకు అంటే... అమ్మవారు ఆదిలోనూ, మధ్యలోనూ కూడా పూజింపబడే విధంగా ఏర్పాటుచేసుకొని మనల్ని అనుగ్రహించాలి అనే కరుణాబుద్ధి కలిగి ఉంది అని తెలియచేయటానికే. తిథులు 30 లో కూడా పూర్ణిమ వరకు పూజింపబడేది అమ్మ (ఆదిశక్తి) యే. (ప్రతిన్ముఖ రాకాంత తిథి మండల పూజితా).

ఇలా ఆయన -- ఋతువు -- మాస --- పక్ష --- తిథులలో రెండుమార్లు పూజింపబడుతూ తొమ్మిదిరోజులపాటు మరి ఏ ఇతర దైవానికీ పూజలు జరగనేజరుగవు.

యోగం అనేది మొత్తం కుండలినీశక్తికి సంబంధించి ఉంటుంది. "కుండలినీ" అనే శబ్దం సంస్కృతంలో స్త్రీలింగం. కాబట్టి ఈ కుండలినీ శక్తిని స్త్రీతో పోల్చి కుండలినీ శక్తినీ సాధించదలచి యోగాన్ని ప్రారంభించిన వ్యక్తికి కలిగే అనుభవాలన్నిటినీ క్రమంగా ఒక స్త్రీలో కలిగే మార్పులుగా వర్ణించి చెప్పారు మన (పూర్వీకులు) పెద్దలు.

అలంకారాల్లో యోగరహస్యం    

ఆ కారణంగా అమ్మవారి తొమ్మిది అవతారాల్లో సాధకునికి క్రమక్రమంగా జరిగే అభివృద్ధి తొమ్మిదిదశల్లో ఉంటుందని ప్రాచీనులు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ తొమ్మిది దశలు దాటిన సాధకుడు "దశ" అవస్థనాటికి విజయాన్ని సాధించి సిద్ధినిపొంది సిద్ధుడౌతాడు. ఆ సిద్ధినే "విజయ(దశమి)సిద్ధి"  అంటారు. 

నవరాత్రులలో ప్రతిరోజూ దేవికి వేసిన ఒక్కొక్క అవతారాన్ని(ఒక్కొక్క అలంకారాన్ని) సాధన చేసే సాధకుని ఒక్కొక్క మెట్టు అభివృద్ధుగా గమనించాలని మనం భావించాలి. ప్రతిరోజూ అమ్మవారి అలంకారాన్ని చూసి రావాలనే నియమాన్ని విధించింది  కూడా ఇందుకే..... సాధకుని ప్రతీ దశలోనూ అభివృద్ధిని గమనిస్తూ ఉండాలనే రహస్యాన్ని అర్థమయ్యేలా చెప్పటానికే ఇవన్నీను. 

ఆశ్వీయుజమాసం చిత్తా నక్షత్రం , పాడ్యమి కలసిన రోజున దేవినవరాత్రులు ప్రారంభించుతారు. ఏ సందర్భంలోనూ రాత్రిపూట కలశ స్థాపన రాత్రిపూట చేయకూడదు.                                    

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరిగే ఉత్సవాలని దుర్గా నవరాత్రి ఉత్సవాలు అని అంటారు. అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారములలో మహిషునితో యుద్ధము చేస్తుంది. ఆఖరిరోజైన తొమ్మిదవరోజు మహిషుని సంహరించి, విజయం సాధించటంతో పదవరోజును విజయదశమి అని మనం పర్వదినాన్ని జరుపుకుంటాము.

 నవదుర్గ అవతార వైభవం 

ప్రధమా శైలపుత్రీచ -- ద్వితీయ బ్రహ్మచారిణీ ;
తృతీయా చంద్ర ఘంటేతి -- కుష్మాండేతి చతుర్థికీ ;
పంచమా స్కంద మాతేతి -- షష్టా కాత్యాయనేతి చ;
సప్తమా కాళ రాత్రిశ్చ -- అష్టామాచాతి భైరవీ;
నవమా సర్వసిద్ధిశ్చేతి -- నవదుర్గాః ప్రకీర్తితా ||



(1) శైలపుత్రీ: 

వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరామ్
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ||            
   

దుర్గామాత తన మొదటి అవతారంలో శైలపుత్రి నామంతో అవతరించెను. పర్వతరాజు హిమవంతునికి పుత్రికగా జన్మించిన కారణముచే శైలపుత్రి అని నామం వచ్చెను. ఈమె వృషభముపై కూర్చొని యుండును. కుడిచేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలము ధరించియుండును. నవదుర్గలలో ప్రధమదుర్గయైన శైలపుత్రి శక్తి అనంతము. నవరాత్రులలో ఈ ప్రధమదిన ఉపాసనయందు యోగులమనస్సు మూలాధారచక్రమునందు నిలిపియుంచెదరు. ఇప్పటినుండియే యోగుల యోగసాధన ప్రారంభమగును.

మొదటిరోజు అమ్మవారికి నైవేద్యం------ కట్టుపొంగలి........ ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)  

http://swetaabhiruchi.blogspot.in/2013/07/blog-post_18.html



(2) బ్రహ్మ చారిణి: 

దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలః
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||      

దుర్గామాత నవశక్తులలొ రెండవ స్వరూపం బ్రహ్మచారిణి. బ్రహ్మ శబ్దమునకు అర్థం తపస్సు. బ్రహ్మచారిణి అనిన తపస్సును ఆచరించేది అని అర్థం. 'వేదస్తత్వం తపోబ్రహ్మ' వేదము, తత్వము, తపస్సు అని బ్రహ్మ శబ్దమునకు అర్థములు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్ణజ్యోతిర్మయమై అత్యంత మనోహరముగా ఉండును.  ఈమె తన కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరిస్తుంది. ఈ తల్లిని పూజించిన సర్వత్రా సిద్ధి, విజయం, సాధకుడికి మనస్సు స్వాధిష్టాన చక్రంలో స్థిరమవుతుంది. ఈమె కఠిన ఆహార నియమాలు ఆచరించి అపర్ణ అయింది.

రెండవరోజు నైవేద్యం -------- పులిహోర..... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)  

http://swetaabhiruchi.blogspot.in/2013/10/blog-post.html

(3) చంద్రఘంట: 

పిండజప్రవరూరుఢా చండకోపాస్త్ర కైర్యుతా
ప్రసాదం తనుతే మహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా ||      


దుర్గామాత మూడవ స్వరూపం చంద్రఘంట. ఈమె స్వరూపము పరమశాంతిదాయకమై, శుభములు చేకూర్చునిదై యున్నది. ఈమె శరీరము పసిడి వన్నెతో మెరయుచుండును. ఈమె శిరస్సుపై అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంవల్ల ఈ పేరు సార్థకమైనది. ఈమె తన పది చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనుస్సు, కమలం, జపమాల, కమండలం, అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది. ఈమె ఘంట నుంచి వెలువడిన థ్వని భయంకరంగా ఉండికౄరులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది. ఈ దినమున సాధకుని మనస్సు మనిపూరచక్రమునందు యుండును. ఈమెను ఆశ్రయించిన సమస్త సంసారిక కష్టముల నుంచి విముక్తులు అవుతారు. ఇహలోకంలోనేకాక పరలోకంలో కూడా సద్గతి లభిస్తుంది. ఈమె వాహనము సింహము. 

మూడవరోజు నైవేద్యం ----- కొబ్బరి అన్నం....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)  

http://swetaabhiruchi.blogspot.in/2013/10/blog-post_10.html

(4) కూష్మాండ:

సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ
దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||        

దుర్గామాత నాల్గవ స్వరూపం కూష్మాండాదేవి.  దరహాసం చేస్తూ బ్రహ్మాండాన్ని అవలీలగా సృష్టిస్తుంది. కాబట్టి ఈమెకు ఆ  పేరు వచ్చింది. ఈమె సర్వమండలాంతర్వర్తిని. రవి మండలంలో నివశించే శక్తి సామర్థ్యాలు ఈ తల్లికే ఉన్నాయి. ఈమె ఎనిమిది భుజాలతో ఉంటుంది. తన ఏడు చేతుల్లోనూ కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద ధరిస్తుంది. ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాలను ధరిస్తుంది. ఈమె సింహవాహనం అధిష్టిస్తుంది. సంస్కృతంలో కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఈమెకు గుమ్మడికాయ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈమెకు గుమ్మిడికాయను బలిగా సమర్పిస్తారు. ఈ దేవిని ఉపాసిస్తే సాధకుని మనసు అనాహతచక్రంలో స్థిరంగా ఉంటుంది. ఉపాసకులకు ఆయురారో గ్యాలను ప్రసాదించటమేగాక, వారి కష్టాలను కూడా పోగొడుతుంది. మనపురాణాలలో తెలిపిన విధంగా దుర్గామాతను మనం భక్తితో పూజించి ఒక అడుగు ముందుకు వేసినచో.... మనలను రక్షించుటకు ఆమె ముందుకు వచ్చును.సహృదయముతో ఈమెను శరణు వేడిన పరమపదము అతి సులభముగా లభించును.


నాలుగవరోజు నైవేద్యం ----- చిల్లులేని అల్లం గారెలు....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)   

http://swetaabhiruchi.blogspot.in/2013/10/blog-post_755.html

(5) స్కందమాత 

సింహాసనాగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా|
శుభదాస్తు సదాదేవి స్కంధమాతా యశస్వినీ||        

దుర్గామాత ఐదవ స్వరూపం స్కంధమాత. స్కంధుడనగా కుమారస్వామి. శక్తిధరుడు. దేవసేనల అధిపతి. నెమలి వాహనుడు. ఈయనకు తల్లి కాబట్టి ఈమెకు 'స్కంధమాత' అనే పేరు వచ్చింది. ఈ తల్లి నాలుగు చేతులతో ఉంటుంది. స్కంధుడిని పట్టుకొని పద్మం ధరించి, ఎడమచేతిలో అభయముద్రను, కమలాన్ని ధరిస్తుంది. కమలవాసిని. శ్వేతవర్ణం కలిగి ఉంటుంది.పద్మాసనాదేవి అనికూడా అంటారు. ఈమె వాహనం సింహవాహనం.ఈమెను ఉపాసించిన సాధకుని మనస్సు విశుద్ధచక్రంలో  స్థిరమవుతుంది, భవసాగరాలనుంచి విముక్తులై మోక్షాన్ని సులభంగా పొందుతారు. స్కందమాతను పూజించిన స్కందభగవానుని కూడా పూజించినట్లు అగును. సూర్యమండలమునకు అధిష్టానదేవి యగుటచే, ఈమెను పూజించిన ఉపాసకులు తేజోవంతులగుదురు. ఈ సంసారసాగర దుఃఖముల నుండి విముక్తి చెంది మోక్షమార్గము చేరుటకు వేరే ఉపాయము లేదు.

ఐదవరొజు నైవేద్యం ------ పెరుగు అన్నం. (దద్ధోజనం) ....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)   

http://swetaabhiruchi.blogspot.in/2013/07/4-12-5-4.html

(6) కాత్యాయని 

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా|
కాత్యాయనీ శుభం దద్వాద్దేవీ దానవఘాతినీ||      

పూర్వం 'కతి' అనే పేరుగల ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్య గోత్రీకుడే కాత్యాయన మహర్షి. ఇతడు ఈ దేవి తనకు కుమార్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు. తపస్సు ఫలించింది. మహిషాసురుడిని సంహరించటంకోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో దేవిని సృష్టించారు. మొదట కాత్యాయని మహర్షి తల్లిని పూజించాడు. కాబట్టే 'కాత్యాయని' అనే పేరు వచ్చింది. కాత్యాయని మహర్షి ఇంటిలో పుట్టింది. కాబట్టి కాత్యాయని అయింది అనే కథకూడా ఉంది. ఈమె చతుర్భుజి. ఎడమచేతిలో ఖడ్గం, పద్మాన్ని ధరిస్తుంది. కుడిచేయి అభయముద్రను, వరముద్రను కలిగి ఉంటుంది. ఉపాసించిన సాధకుడి మనసు ఆజ్ఞాచక్రంలో స్థిరమవుతుంది. తన సర్వస్వమునూ ఈ తల్లి చరణాలలో పరిపూర్ణంగా సమర్పించాలి. అప్పుడు ఆమె అనుగ్రహించి రోగాలనూ, శోకాలనూ, భయాలనూ పోగొడుతుంది. ధర్మార్థకామమోక్షాలను ప్రసాదిస్తుంది.ఈమె వాహనం సింహము.  

ఆరవరోజు నైవేద్యం ----- రవ్వ కేసరి....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)   

http://swetaabhiruchi.blogspot.in/2013/10/blog-post_8660.html


(7) కాళరాత్రి 

ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా
లంబోష్టి కర్ణికాకర్ణితైలాభ్యక్త శరీరిణి|
వామపాదోల్ల సల్లోహ లతాకంటకభూషణా
వరమూర్థధ్వజాకృష్టా కాళరాత్రీర్భయంకరీ||  



ఈ తల్లి శరీర వర్ణం గాఢాంధకారంవలె నల్లనిది. తలపై కేశాలు విరబోసుకొని, మెడలో హారం విద్యుత్‌కాంతితో వెలుగుతుంది. ఈమె నాసిక నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడుతుంటాయి. ఈమె వాహనం గాడిద. కుడిచేతిలో అభయముద్ర, వరముద్ర కలిగి ఉంటుంది. ఎడమచేతిలో ముళ్ళ ఇనుప ఆయుధం, ఖడ్గం ధరిస్తుంది. చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ భక్తులపాలిటి కల్పతరువు. ఈ తల్లిని గనక ఉపాసిస్తే మనస్సు సహస్రార చక్రంలో స్థిరంగా ఉంటుంది. సమస్త పాపాలు, విఘ్నాలు తొలగుతాయి. గ్రహబాధలు ఉండవు. అగ్ని, జల, జంతు, శత్రు, రాత్రి భయాలు ఉండవు.ఈమె వాహనము గాడిద.   

ఏడవరోజు నైవేద్యం ------ కూరగాయలతో అన్నం....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)   

http://swetaabhiruchi.blogspot.in/2013/10/blog-post_3911.html

(8) మహాగౌరి 

శ్వేతేవృషే సమారూఢా శ్వేతాంబరధరాశుచిః|
మహాగౌరిశుభం దద్వాత్‌, మహాదేవ ప్రమోధరా||  
     
ఈమె ధరించే వస్త్రాలు, ఆభరణాలు తెల్లని కాంతులతో మెరుస్తుంటాయి. ఈమె వృషభ వాహనంపై ఉంటుంది. చతుర్భుజి. కుడిచేతుల్లో అభయముద్రను, త్రిశూలాన్ని ధరిస్తుంది. ఎడమచేతుల్లో ఢమరుకాన్ని, వరముద్రనూ కలిగిఉంటుంది. శివుడిని పరిణయమాడాలని కఠోరంగా తపస్సు చేసింది. అందువల్ల ఈమె శరీరం నల్లగా అయిపోయింది. ఆమె తపస్సుకు సంతోషపడిన శివుడు ప్రసన్నుడై ఈమె శరీరాన్ని గంగాజలంతో పరిశుద్దంచేశాడు. ఆ కారణంగా ఈమె శ్వేతవర్ణశోభిత అయింది. మహాగౌరిగా విలసిల్లింది. ఈ మాతను ఉపాసిస్తే కల్మషాలన్నీ పోతాయి. సంచితపాపం నశిస్తుంది. భవిష్యత్తులో పాపాలు, ధైన్యాలు దరిచేరవు. ఈ తల్లిని ధ్యానించి, స్మరించి, పూజించి ఆరాధించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి. ఈమె వాహనము వృషభము.  

ఎనిమిదవరోజు నైవేద్యం ----- చక్కెర పొంగలి (గుడాన్నం)...... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)  

http://swetaabhiruchi.blogspot.in/2013/06/2-12-4-1-1-50-25.html

(9) సిద్ధిధాత్రీ దేవి

సిద్ధం గంథర్వయక్షాద్వైః అసురైరమరైరపి|
సేవ్యమానా సదా భూయాత్‌ సిద్ధిదా సిద్ధిదాయినీ||          

మార్కండేయ పురాణంలో అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈశిత్వ, వశిత్వ, సర్వకామావసాయిత, సర్వజ్ఞత, దూరశ్రవణ, పరకాయ ప్రవేశ, వాక్సిద్ధి, కల్పవృక్షత్వ, సృష్టిసంహరీకరణ, అమరత్వం, సర్వనాయకత్వం, భావసిద్ధి అని అష్టసిద్ధులు చెప్పబడ్డాయి. 

ఈ తల్లి పరమశివుడితో కలసి అర్థనారీశ్వరుడిగా అవతరించింది. చతుర్భుజి. సింహవాహనాన్ని అధిరోహించింది. కమలవాసిని. కుడిచేతుల్లో గదను, చక్రాన్ని, ఎడమచేతుల్లో శంఖాన్ని, కమలాన్ని ధరించింది. ఈ మాతను ఉపాసించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. లౌకిక, పారలౌకిక మనోరథాలు నెరవేరతాయి.

తొమ్మిదవరోజు నైవేద్యం ----- పాయసాన్నం....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)  

http://swetaabhiruchi.blogspot.in/2017/09/blog-post.html

చిద్విలాసిని రాజరాజేశ్వరి 

ఈ పండుగను పదిరోజులు చేసినా రాత్రులు మాత్రం తొమ్మిదే. దశమి రోజున అమ్మవారు రాజేశ్వరి అవతారంలో రాక్షససంహారం చేసింది. ఎంతో ప్రశాంతతతో, చిరునవ్వుతో సకల విజయాలు ప్రసాదిస్తుంది.        

అలాగే సువాసినీ పూజ. ప్రతిరోజూ ఒక మల్లెపూవును అమ్మవారిగా భావనచేసి ఆమెకు సర్వ ఉపచారాలు చేసి, వస్త్రం, ఫలం సమర్పించాలి. ఈ పది రోజులూ పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు పంచిపెడితే సౌభాగ్యం లభిస్తుంది. దేవీభాగవత పారాయణం, శ్రీదేవీ సప్తశతీ నిత్యపారాయణం శ్రేష్ఠం. దుర్గా ద్వాత్రింశమాలాస్తోత్రం 108సార్లు పారాయణం చేస్తే అఖండఫలితాలు లభిస్తాయి, అలాగే కుమారీపూజను ఆచరించి మంచి ఫలితాలను పొందవచ్చు. రోజుకొక బాలికను పూజించాలి. వివిధ వయస్సులవాళ్ళు ఉంటే మంచిది. కేవలం 10 ఏళ్లలోపు బాలికలు మాత్రమే ఉండాలి. భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లి రుణను కోరితే తప్పక ఆమె కరుణిస్తుంది.

నైవేద్యం ----- చిత్రాన్నం,(నిమ్మ పులిహోర),  లడ్డూలు ....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)  

http://swetaabhiruchi.blogspot.in/2013/04/ll-ll-4-2-4-12-2.html



సర్వేజనా సుఖినోభవంతు

మహిషాసురుని జన్మ వృత్తాంతం.

మహిషాసురుని జన్మ వృత్తాంతం.       

దానవ వంశానికి మూలపురుషుడు దనువు. అతనికి రంబుడు కరంబుడు అనే ఇద్దరు కుమారులు గలరు. వారికి సంతానము కలుగలేదు. ఆ దిగులతో వారిద్దరూ సంతానము కొరకు తపస్సు చేయగా, వీరి తపస్సుకు ఇంద్రుడు భయపడి, మొసలి రూపంలో వచ్చి కరంబుని పాదాలు పట్టుకొని, నీళ్ళలోకి లాగి సంహరించెను. రంబుడికి ఇది తెలిసి, తన తలను నరికి అగ్నికి ఆహుతి చేయ్యబోగా, అగ్ని దేముడు వారించి, చచ్చి ఏమి సాధిస్తావు ఆత్మహత్య మహాపాతకము నీకేమి వరం కావాలో కోరుకోమని చెప్పెను. అంతట రంబుడు అగ్నికి ఈ విధంగా సమాధానమిచ్చాడు---- ఓ అగ్నిదేవా ! త్రిలోకవిజేతను పుత్రునిగా అనుగ్రహించు, దేవదానవమానవులకు ---- అజేయుడు, కామరూపధారి, మహాబలశాలి వంటి లక్షణములున్న పుత్రునిని ప్రసాదించమని కోరెను. అప్పుడు అగ్నిదేముడు "నీ మనస్సు ఏ కామినిపై లగ్నమౌతుందో ఆమెవల్ల నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు. "అనిచెప్పి అదృశ్యమయ్యెను.

రంభాసురుడు అచటినుండి బయలుదేరి, ఇంటికి చేరుకుంటూ దారిలో ఎదకువచ్చి, కామార్తియై, ఉన్న ఒక మహిషి (గేదె) ని చూసేను. ఆమెను చూడగానే రంబుని మనస్సు చలించెను. దానితో సంగమించాడు. అది గర్భవతియైనది. దానిని తీసుకొని పాతాళమునకు చేరుకున్నాడు. అలా రంబునికి - మహిషికి పుట్టినవాడే "మహిషాసురుడు".

ఈ మహిషాసురుడు వేలసంవత్సరాలు  తపస్సు చేయగా, బ్రహ్మ ప్రత్యక్షమై వరాలు కోరుకోమనెను. తనకు మరణము లేకుండా ఉండాలని మహిషాసురుడు వరము కోరెను. నీ కోరిక ప్రకృతికి విరుద్ధమైనది. మరణానికి ఒక్క అవకాశం విడిచిపెట్టి, మరేదైనా కోరుకోమనెను. అంతట మహిషుడు  పురుషుని చేతిలో నాకు మరణము లేకుండా వరమివ్వు, ఆడది అబల, నన్ను సంహరించుట అసాధ్యము అని అనెను. అప్పుడు బ్రహ్మ ఓ మహిషాసురా ! నీ మరణము ఆడదాని చేతిలోనే ఉన్నది అని తెలిపి అంతర్ధానం అయ్యెను. ఇది మహిషాసురుని జన్మ వృత్తాంతం. 

ఈ విధంగా వరగర్వితుడైన మహిషాసురుని బాధలు తట్టుకోలేక, బ్రహ్మాదిదేవతలు అందరూ కలిసి, విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి మమ్ములను రక్షింపుమని వేడుకొనగా, ఒక్క  స్త్రీ  చేతిలోనే అతని మరణం సంభవిస్తుంది కనుక.... మీ మీ శక్తులన్నిటినీ కలిపి ఒక స్త్రీమూర్తిగా రూపొందించి మన ఆయుధములను కూడా ఆమెకు ఇచ్చి మహిషుని సంహరిద్దాము అని తెలిపెను. ఈ విధంగా అందరి శక్తులను, ఆయుధములను అందుకొని ఆదిపరాశక్తిగా అవతరించి ఎనిమిది రోజులు భీకర పోరాటం సలిపి తొమ్మిదవ రోజున మహిషుని సంహరించింది. కనుకే ఈమెను మహిషాసురమర్ధిని అని పేర్కొంటారు.ఇది మూలకథ.




                                  

కుమార శతకం 91 నుండి 100 వరకు శ్లోకాలు

కుమార శతకం 91 నుండి 100 వరకు శ్లోకాలు

91 వశ్లోకం 
చము రింకిపోయినను దీ
పము శామియించిన విధంబు పౌరుష విహీ
నమె యగును; దైవ మనుకూ
లము గాకుండినను భూతలమున కుమారా!

భావం
ఓ కుమారా! చమురు ఇంకిపోయినపుడు దీపమెట్లు కరమంగా క్షీణించునో అట్లే భగవంతుడు అనుకూలింఫనపుడు మానవుని పరాక్రమము గూడా అట్లే క్షీణించి పోవును.

92 శ్లోకం 
ఘన బీజపు సాయము లే
కను భూములు నిష్ప్రయోజకంబైన విధం
బున దైవము తోడిలఁ గా
కనె పౌరుష కర్మఫలము గలదె కుమారా!

భావం
ఓ కుమారా! భూమియందు గొప్పవైన విత్తనములు నాటకపోయినట్లయిన ఆ భూమి నిష్ప్రయోజనమగును. అట్లే భగవంతుని సహాయము లేనిదే పురుషుని పనులు నెరవేరవని భావము. కావున భూమి పండి సత్ఫలితాలను ఇవ్వాలంటే మంచి విత్తనములు ఎట్లు అవసరమో అట్లే మన పనులు నెరవేరాలంటే భగవంతుని సాయం కూడా కావాలి.

93 శ్లోకం  
ధర నే వస్తువులైనన్
దరగుటకై వృద్ధినొందు దగ బొడవెదుగున్
విరుగుటకై పాయుటకై
దరిజేరును వీని మదిని దలతె కుమారా!

భావం
ఓ కుమారా! పెరుగుట విరుగుట కొరకే. భూమియందు ఏ వస్తువులైననూ తగ్గుటాకే పెరుగుదలను పొందును. మిక్కిలి పొడవు పెరిగితే విరుగును కదా! దగ్గరకు చేరుట దూరమగుటకేనని తెలియుము. మనసునందు ఈ విషయములను గుర్తించుకొని మెలగుము.

94 శ్లోకం  
మధురంబుల గొననొల్లడు
బుధజను డేకతమ దారిబోనొల్లడు నీ
విధ మెఱిగి నీవును మనో
రధ సిద్ధుడా వగుచు మెలగరాదె కుమారా!

భావం
ఓ కుమారా! పండితులు తీపిపదార్థములను ఒంటరిగా తినరు. ఒంటరిగా ప్రయాణించరు. ఇందలి సూక్షములను గ్రహించి మసలు కొనుము.

95 శ్లోకం  
చపలాత్ముడవని లోపల
నపాత్ర జనులకును దాన మందిచ్చుటా హీ
నపు గుక్క నోటి లోపల
నిపుణత నెయిపోసినట్లు నెగడు కుమారా!

భావం
ఓ కుమారా! ఈ భూమియందు చంచల స్వభావులైనవారు అయోగ్యులైన ప్రజలకు దానము చేయుట నీచమైన కుక్కనోట్లో నేతిని పోసిన విధముగా నగును. యోగ్యాయోగ్యతలను తెలిసి పాత్రాపాత్రదానము చేయవలెను దానిని బట్టే ప్రయోజనములు కలుగును.

96 శ్లోకం 
యోగ్యుల నరయుగలేక య
యోగ్యులకున్ దానమొసగుచుండుటా యిది స
ద్భోగ్యసతిన్ షండునకున్
భాగము గని పెండ్లి చేయు పగిది కుమారా!

భావం
ఓ కుమారా! యుక్తవయసుగల వధువును తాంబూలముతో సహా నపుంసకునికిచ్చి వివాహం జేసినచో అది నిష్ప్రయోజనమ్గును. అట్లే యోగ్యులను తెలియక అయోగ్యులకు దానమొసంగినచొ నవయవ్వన సుందరాంగిని నపుంసకునికిచ్చి వివాహం చేసిన చందముతో నుండును.

97 శ్లోకం 
మును గల్గి ధర్మమును జే
యునతడు పేద పడెనేని యున్నంతకు దో
చిన భంగి నర్ధులకును ని
చ్చునతడె బహు పుణ్య పురుషుండు కుమారా!

భావం
ఓ కుమారా! తనకు సంపద కలిగినపుడు ధర్మకార్యములను ఎక్కువగా చేయవలెను. లేనపుడు కనీసము యాచకులకైననూ దానము చేయవలెను. అట్లు మసలువానినే పుణ్యపురుషుడందురు.

98 శ్లోకం 
కడు మెల్లన నిడు నుత్తర
మడచును గోపమును దీక్ష్మ మరయగ దాన
ప్పుడు నుడివెడు నుత్తర మది
వడి గోపము బెంచు నరయ వసుధ కుమారా!

భావం
ఓ కుమారా! ఆలోచించి చూసినచో ఈ భూమియందు ఎదుటివారికోపము అణచవలెనన్నచో మిక్కిలి శాంతముతో సమాధానమీయవలెను. మనము కూడా కోపగించినచో ఎదుటివాని కోపము తీవ్రమగునే కాని తగ్గదు.

99 శ్లోకం 
పని బూని జనులు సంతస
మునఁ దాలిమి సత్యశౌచములను బ్రవర్తిం
చిన యశము నొందుచుందురు
గనుగొను మిదె దొడ్డ నడకఁ గాగ కుమారా!

భావం
ఓ కుమారా! ప్రజలు, తాము చేయు పనులను సత్యమార్గము, సంతోషముతో చిత్తశుద్ధితో ఓర్పు కలిగి చేయవలెను. అట్లు చేసినచో లోకమున కీర్తిని పొందుదురు. ఇదియే మంచిమార్గమని తెలుసుకొనుము.

100 
శ్లోకం 
తన సత్కర్మాచరణం
బున భాగ్యము వేగవృద్ధి బొందు జగత్ప్ర్రా
ణుని వర సాహాయ్యముచే
ననలం బెంతైన బెరుగునయ్య కుమారా!

భావం
ఓ కుమారా! అగ్నివృద్ధి పొందాలంటే వాయువు ఎట్లు అవసరమగునో మంచిపనులు చేయుటవలన సంపదలు కూడా అట్లే అభివృద్ధి చెందును.

కుమార శతకం 81 నుండి 90 వరకు శ్లోకాలు

కుమార శతకం 81 నుండి 90 వరకు శ్లోకాలు 


81 వ శ్లోకం 
ధరణీజాతము లే యే
తరి నెట్లట్లను ఫలించుఁ దగనటు పూర్వా
చరణ ఫలంబు ననుభవము
గరమను భవనీయమగును గాదె కుమారా!

భావం 
ఓ కుమారా! ఈ ధరణిపై ఏయే ఋతువులందు ఏయే విధములుగా వృక్షములు ఫలించునో ఆయావిధముగానే మానవులు తమ పూర్వజన్మములందు చేసిన పాపపుణ్యములఫలములు ఈ జన్మమునందు అనుభవింతురు సుమా!

82  వ శ్లోకం 
ఘనులు విని సమ్మతింపని
పనులకు జొతబడక పొగడు పనులను జొరు; మెం
డును బొంకబోక కడ స
జ్జనములతో గలసి మెలగు జగతి కుమారా!

భావం 
ఓ కుమారా! పెద్దలు వలదన్న చెడుపనులను చేయకుము. వారల మెప్పు పొందునట్లు మంచిపనులను చేయుము. అసత్యములు పలుకరాదు. పలుకుటకు వెళ్ళరాదు.మంచివారితో స్నేహము చేసి మంచి అనిపించుకొనుము..

83  వ శ్లోకం 
రోషావేశము జనులకు
దోషము తలపోయ విపుల దుఃఖకరము నౌ
రోషము విడిచిన యెడ సం
తోషింతురు బుధులు హితము దోప కుమారా!

భావం 
ఓ కుమారా! ఆలోచించి చూడగా కోపావేశములు మనుజులకు ఎక్కువ పాపమును అంటగట్టును దుఃఖములకు మూలమవియే. అట్టి గుణములను త్యజించిన వారిని పండితులు పొగిడి మెచ్చుకొందురు.

84  వ శ్లోకం 
గుణవంతుని సంగతి ని
ర్గుణులకు గుణములు ఘటించు కుసుమాది సమ
ర్పణమున వస్త్రాదిక మా
క్షణమున పరిమళము నొందు కరణి కుమారా!

భావం 
ఓ కుమారా! పువ్వులు,అత్తరులు మొదలగు వానిచే వస్త్రాదులు గుభాళించునట్లు గుణవంతులతొ కూడిన గుణహీనులకు గూడ గౌరవ మర్యాదలు అబ్బును.

85  వ శ్లోకం 
మును మనుజుడు జన్మాంతర
మున చేసిన పుణ్య పాపములు పుడమిని వా
నిని బొందక విడువవు దే
వుని నిందింపకుము కీడు వొడుమ కుమారా!

భావం 
ఓ కుమారా! పూర్వ జన్మములందు మానవుడు చేసిన పుణ్యపాపములవలన ఈ జన్మములో కష్టసుఖాలనేవి సంభవించును. ఆ పుణ్యపాపముల ఫలమును పొందక విడువవు. నీ కష్టములకు కారణము భగవంతుడని దూషింపకుము భగవంతుని అన్యాయముగా నిందించినచో భంగపడుదువు సుమా!

86  వ శ్లోకం 
అల సరసాన్నంబుల బరి
మళము గలుగు వస్తువులను మహితల యానం
బుల నాసనముల సుబ్బకు
కలుగుం జను కాలవశముగాను కుమారా!

భావం 
ఓ కుమారా! ఈ భూమి యందు అన్నపానాదులు, పరిమళద్రవ్యాలు, వాహనములు, ఆసనములు మున్నగునవి కాలముననుసరించి కలుగుచుండును. అ సౌకర్యములను జూచి పొంగిపోకుము. నీ రాత బాగుండదని కాలమున అన్నియు నీ నుండి దూరమగును.

87  వ శ్లోకం 
మనుజులు తన సౌఖ్యము కొర
కును సంరక్షణము నవని గోరుదు రొగి నే
జన పాలుఁడు సంరక్షిం
పను దగియును బ్రోవ డతడే పాపి కుమారా!

భావం 
ఓ కుమారా! ఈ భూమిపై మనుజులు సుఖములు గోరి రక్షణ ఏర్పాటు చేసుకొందురు. రక్షింపగలిగిన సామర్ధ్యము ఉండియు రక్షింపనివాడు పాపాత్ముడే.

88  వ శ్లోకం 
మండలపతి దండార్హుల
దండింపక యుండరాదు ధారుణి నాత డ
ఖండల సమానుడైనను
మెండగు పాపంబు నొంది మెలగు కుమారా!

భావం 
ఓ కుమారా! ప్రభువు నిందితులను శిక్షింపవలెను. వారిని దండించకుండా విడిచిపెట్టరాదు. నిందితులను దండింపని ప్రభువు ఇంద్రునితో సమానుడైననూ మిక్కిలి పాపమును మూట గట్టుకొనును.

89  వ శ్లోకం 
కత్తిని చేతం బట్టుచు
మొత్త దలచి వచ్చువాని ముఖ్యముగా మే
ల్వత్తించిన నదె ప్ర్రాయ
శ్చిత్తమతని జంపదగదు చిన్ని కుమారా!

భావం 
ఓ కుమారా! కత్తిని చేత ధరించి చంపుతానని వస్తున్న వానిని ఎదిరించకుండా వానికి కావలసిన ప్రయోజనములను కలుగజేసినచో అదే అతనికి ప్రాయశ్చితమునిచ్చి మంచివానిగా జేయును. అట్టి వానిని చంపరాదు. పొసగమేలు చేసి పొమ్మనుటే ఉత్తమమైనది.

90  వ శ్లోకం 
పురుషుం డొనర్పని పనికి
నరయగ దైవం బదెట్టు లనుకూలించున్
సరణిగ విత్తక యున్నను
వరిపండునె ధరణిలోన వరలి కుమారా!

భావం 
ఓ కుమారా! భూమి యమ్దు సరిగా విత్తనము నాటాకున్నచో వరిపైరు ఏ విధముగా మంచిఫలితాలను ఇవ్వదో అట్లే మనిషి తన ప్రయత్నము తాను చేయకున్నచో ఆ పనికి భగవంతుడు ఏ విధంగా అనుకూలించును? (అనుకూలించడని భావము.)

September 12, 2013

భ్రమరాంబాష్టకం

భ్రమరాంబాష్టకం

1
శ్రీ కంఠార్పితపత్రగండయుగళాం - సింహాసనాధ్యాసినీం |
లోకానుగ్రహకారిణీం గుణవతీం - లోలేక్షణాం శాంకరీం |
పాకారిప్రముఖామరార్చితపదాం - మత్తేభకుంభస్తనీం |
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్‌||
2
వింధ్యాద్రీంద్రగృహాన్తరే నివసతీం - వేదాన్తవేద్యాం నిధిం |
మందారద్రుమపుష్పవాసితకుచాం - మాయాం మహామాయినీః|
బంధూక ప్రసవోజ్వలారుణనిభాం - పంచాక్షరీరూపిణీం |
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్‌||
3
మాద్యచ్ఛుంభనీశుంభమేఘపటల - ప్రధ్వంసజంఝానిలాం |
కౌమారీ మహిషాఖ్యశుష్కవిటపీ - ధూమోరుదావానలాం |
చక్రాద్యాయుధసంగ్రహోజ్జ్వలకరాం - చాముండికాధీశ్వరీం |
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్‌||
4
కేళీమందిరరాజతాచలసరో - జాతోరుశోభాన్వితాం -
నక్షత్రేశ్వరశేఖరప్రియతమాం - దేవీ జగన్మోహినీమ్‌ |
రంజన్మంగళదాయినీం శుభకరీం - రాజత్స్వరూపోజ్జ్వలాం |
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్‌||
5
సంసారార్ణవతారికాం భగవతీం - దారిద్ర్యవిధ్వంసినీం |
సంధ్యాతాండవకేళికప్రియసతీం - సద్భక్తకామప్రదాం |
శింజన్నూపురపాదపంకజయుగాం - బింబాధరాం శ్యామలాం |
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్‌||
6
చంచత్కాంచనరత్నచారుకటకాం - సర్వంసహావల్లభాం |
కాంచీకాంచనఘంటికాఘణఘనాం - కంజాతపత్రేఓనాం |
సారోదారగునాంచితాం పురహర - ప్రాణేశ్వరీం శాంభవీం |
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్‌||
7
బ్రహ్మర్షీ శ్వరవంద్పాదకమలాం - పంకేరుహాక్షస్తుతాం |
ప్రాలేయాచలవంశపావనకరీం - శృంగారభూషానిధఙం |
తత్త్వాతీతమహాప్రభాం విజయినీం - దాక్షాయణీం భూరవీం |
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్‌||

భ్రమరాంబామహాదేవ్యా - అష్టకం సర్వసిద్ధిదం |
శత్రూనాం చాసురాణాం చ - ధ్వంసనం త ద్వదా మ్యహమ్‌||




నవదుర్గల ధ్యానము

నవదుర్గల ధ్యానము

శైలపుత్రీ: 
వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ 
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ || 

బ్రహ్మ చారిణి: 
దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలః 
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా || 

చంద్రఘంట: 
పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా 
ప్రసాదం తనుతే మహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా || 

కూష్మాండ: 
సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ 
దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే || 

స్కందమాత: 
సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా 
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ || 

కాత్యాయని: 
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా 
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ || 

కాళరాత్రి: 
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా 
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ | 
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా 
వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ || 

మహాగౌరి: 
శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరభరా శుచిః 
మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా || 

సిద్ధధాత్రి: 
సిద్ధ గంభర్వ యక్షాద్యైః అసురైర మరైరపి 
సేవ్యమానా సదా భూయత్ సిద్ధిదా సిద్ధిదాయినీ | 
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే 
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే ||



బాలాస్తుతి

బాలాస్తుతి

ఆయీ ఆనన్దవల్లీ అమృతకర తల్లీ ఆదిశక్తీ పరాయీ
మాయా మాయా స్వరూపీ స్ఫతికమణిమయీ మాతంగీ షడంగీ
జ్ఞానీ జ్ఞానస్వరూపీ నళినపరిమళీ నాద ఓంకార యోగీ
యోగీ యోగాసనస్థా భువనవశకరీ సౌన్దరీ ఐం నమస్తే ||

బాలా మన్త్రే కతాక్షీ మమహృదయసఖీ ముక్తభావ ప్రచండీ
వ్యాళీ యజ్ఞోపవీతే వికత కటి తటీ వీరశక్తీ ప్రసాదీ
బాలే బాలేన్దుమౌళే మదగజభుజహస్తాభిషేక్త్రీ స్బతన్త్రీ
కాళీ త్వాం కాలరూపీ ఖగ గలన హృదీ, కారణీ క్లీం నమస్తే ||

మూలాధారే మహిమ్నీ హుతవహనయనీ మూలమన్త్రీ త్రినేత్రీ
హారాః కేయూరవల్లీ అఖిలసుఖకరీ అంబికాయాః శివాయా
వేదే వేదాన్తరూపీ వితత ఘనతటీ వీరతన్త్రీ భవానీ
శౌరీ సంసార యోనీ సకల గుణమయీ తేద్య శ్రీం సౌః నమస్తే ||

ఐం క్లీం సౌః సర్వమన్త్రే మమ వరశుభకరీ అంగనా చేష్టితాయా
శ్రీం హ్రీం క్లీం బీజముఖ్యైః దినకర కిరణైః జ్యోతిరూపే శివాఖ్యే
హ్రీం మ్రీం హ్రూం హేమవర్ణే హిమకరకిరణా భాసమానేన్దుచూడే
క్షాం క్షీం క్షూం క్షౌమవాసే సకల జయకరీ శక్తి బాలే నమస్తే ||




దుర్గాదేవి స్తోత్రం

దుర్గాదేవి స్తోత్రం

అర్జున ఉవాచ

నమస్తే సిద్ద సేవ్యానీ ఆర్యే మందార వాసినీ
కుమారీ కాళీ కపాలీ కపిలే కృష్ణపింగళే
భద్రకాళీ నమస్తుభ్యం కోటదుర్గా నమోస్తుతే
దండీ చండీ నమస్తుభ్యం తారణీ వరవర్ణినీ
కాత్యాయనీ మహాభాగే కరాళీ విజయే జయే
శిఖి పింఛ ధ్వజ ధరే నానా భరణ భూషితే
అట్ఠశూల ప్రహారిణే - ఖడ్డఖేటక ధారిణీ
గోపేంద్ర స్వానుజే జ్యేష్ఠే - నందగోపకులోద్బవే
మహిషా సృక్ప్రియే నిత్యం కౌశికీ పీత వాసినీ
అట్టహాసే కోక ముఖే నమస్తే - స్తు రణప్రియే
ఉమేశాకంబరీ శ్వేతే కృష్ణేకైటభ నాశినీ
హిరణ్యాక్షీ విరూపాక్షీ ధూమరాక్షీచ నమోస్తుతే
వేదశృతి మహాపుణ్యే బ్రహ్మణ్యేజాత వేదసీ
జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాళిమే
త్వం బ్రహ్మావిద్యా విద్యానాం మహానిద్రాచ దేహినాం
స్కందమాత ర్భ్గవతీ దుర్గే కాంతారవాసినీ
స్వాహాంకారః స్వధా చైవ కళా కాష్టా సరస్వతీ
సావిత్రీ వేదమాతాచ తథా వేదాంత రుచ్యతే
స్తుతాసిత్వం మహాదేవీ విశుద్దే నాంత రాత్మనా
జయో భవతు మే నిత్యం త్వత్ ప్రసాదాత్ రణాజిరే
కాంతార భయ దుర్గేషు భక్తానాం పాలనే షు చ
నిత్యం వససి పాతాళే యుద్దే జయసి దానవాన్
త్వం భజనమోహినీ చ మాయాహీ శ్శ్రీ స్తదైవచ
వసంద్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా
తుష్టిః పుష్టిః దృతిర్ధీప్తి శ్చంద్రా దిత్య వివర్థినీ
భూతి ర్భూతిమతా సఖ్యే వీక్ష్యస్యే సిద్ద చారణైః || 





గౌరీశాష్టకం

గౌరీశాష్టకం

భజ గౌరీశం, భజ గౌరీశం, గౌరీశం భజ మందమతే!(ధ్రువపదమ్‌)
జలభవ దుస్తరజలధిసుతరణం ధ్యేయం చిత్తే శివహరచరణమ్‌,
అన్యోపాయం నహి నహి సత్యం, గేయం శంకర!శంకర!నిత్యమ్‌||

దారాపత్యం క్షేత్రం విత్తం దేహం గేహం సర్వమనిత్యమ్‌,
ఇతి పరిభావయ సర్వమసారం, గర్భవికృత్యా స్వప్నవిచారమ్‌||

మలవైచిత్య్రే పునరావృత్తిః పునరపి జననీ జఠరోత్పత్తిః,
పునరప్యాశాకులితం జఠరం కిం నహి ముంచసి కథయేచ్చిత్తమ్‌||

మాయాకల్పిత మైంద్రంజాలం, నహి తత్సత్యం దృష్టివికారమ్‌,
జ్ఞాతే తత్త్వే సర్వమసారం, మాకురు మాకురు విషయవిచారమ్‌||

రజ్జౌ సర్పభ్రమణారోపః తద్వద్బ్రహ్మణి జగదారోపః,
మిథ్యామాయామోహవికారం, మనసి విచారయ వారం వారమ్‌||

అధ్వరకోటీగంగాగమనం, కురుతో యోగం చేంద్రియ దమనమ్‌,
జ్ఞానవిహీనః సర్వమతేన నభవతి ముక్తో జన్మశతేన||

సోహం హంసో బ్రహ్మైవాహం, శుద్ధానందస్తత్త్వపరోహమ్‌,
అద్వైతోహం సంగవిహీనే చేంద్రియ ఆత్మని నిఖిలే లీనే||

శంకరకింకర!మాకురు చింతాం చింతామణినా విరచితమేతత్‌,
యః సద్భక్త్యా పఠతి హి నిత్యం, బ్రహ్మణి లీనో భవతి హి సత్యమ్‌||



September 11, 2013

కుమార శతకం 71 నుండి 80 వరకు శ్లోకాలు

కుమార శతకం 71 నుండి 80 వరకు శ్లోకాలు

71 వ శ్లోకం 
ధర నొక్క బుద్ధిహీనున్
దిరముగ రోటనిడి దంచేనేనియు,  బెలుచం
దురు, యగును గాని యతనికి
సరసత్వము గలుగదండ్రు సతము కుమారా!

భావం 
ఓ కుమార! బుద్ధిలేనివానిని రోటిలో దంచిననూ బుద్ధిరాదు. వాని బుద్ధిహీనత ఎక్కువ అగును. చతురత మాత్రం వానికి ఎన్నిటికి కలుగదు.

72 వ శ్లోకం 
పుడమిని దుష్టత గల యా
తడు లంచంబులు బట్ట దలుచుచు మిడియౌ
నడవడి విడి యందరి వెం
బడి ద్రిప్పికొనుచును గీడు వరుప కుమారా!  

భావం 
ఈ కుమారా! ఈ ఇలలో చెడ్డబుద్ధిగలవారు, గర్వముతో లంచములను పుచ్చుకొనదలంతురు. తమతో అవసరం కల్గిన మనుష్యులకు, కష్టములను కలిగించు స్వభావముతో తమవెంట పలుమార్లు త్రిప్పించుకొందురు.

73 వ శ్లోకం 
సదమల మతితోఁ బెద్దల
మదికింపుగ మెలగు, నింద మానుము పరులన్
మృదు మార్గములను వదలకు 
విదితంబుగ దాన: గీర్తి వెలయుఁ గుమారా!

భావం 
ఓ కుమారా! పెద్దలు సంతోషించునట్ల్లు నిర్మలమైన మనస్సుతో మెలగుము. ఇతరులను నిందించుట మానవలెను. మంచిపద్ధతులను విడిచిపెట్టకు. ఈ విధముగ నడుచుకొన్నచో మంచిపేరు వచ్చును.

74 వ శ్లోకం 
పుట్టినది మొదలు పర సతి
బట్టగఁ జూచుటయు నింద పద్ధతి యను చు
న్నట్టి పురుషుండు పుడమిం
బుట్టిన జనతతుఅలఁ  గీర్తిబొందుఁ గుమారా!

భావం 
ఓ కుమారా! పుట్టినప్పటినుండి ఇతరుల భార్యలను చెరపట్టవలెనని చూచుటవలన నిందల పాలగును. అనుభవమును మనస్సునందుంచుకొని మెలగవలెను. అట్టివాడు ప్రజలచేత గీర్తింపబడును.

75 వ శ్లోకం 
ధరణిని పరోపకారా
చరణ వ్రతనిష్ట నెపుడు సలుపుము నీకా
తెర గుపవాసాది వ్రత 
వరకర్మము కంటె మేలు వచ్చు కుమారా!

భావం 
ఓ కుమారా! ఈ భూమి, యందెల్లప్పుడును ఇతరులకు సహాయము చేయుచుండుము. నియమ, నిష్టలతో వ్రతములకు చేయుము. వ్రతములు చేయుట వలన వచ్చు ఫలము కన్ననూ, ఇతరులకు మేలు చేయుటవలన కలుగు ఫలితమే గొప్పదని తెలుసుకొనుము.

76 వ శ్లోకం 
విను లోకంబున ధర్మం
బనగఁ గులాచారమట్ల నరసి నడువఁ దా
గను మాయుః కీర్తుల నిహ
మునఁ బరమునఁ బొందు సౌఖ్యములను గుమారా!

భావం 
ఓ కుమారా! లోకమందు కులాచారమును తెలుసుకొని మసలుటయే ధర్మమనబడును. దీనివలన కీర్తిప్రతిష్టలు, ఆయుష్యు, ఇహపరసౌఖ్యములు కలుగును. ఈ విషయమును గమనించి నడుచుకొనుము.

77 వ శ్లోకం 
సరి వారి లోన నేర్పున
దిరిగెడి వారలకు గాక తెరువాటులలో 
సరయుచు మెలగెడి వారికి
పరు వేటికి గీడె యనుభవంబు కుమారా!

భావం 
ఓ కుమారా! నీ తోటివారలతో మెలగునపుడు మంచి తెలివితేటలతో మెలగవలెను. సజ్జనుల సాంగత్యము చేయుము. అట్లుగాక దుష్టుల, దొంగల స్నేహము చేయువారికి గౌరవముండదు. చివరకు ఆపదయే సంప్రాప్తించును.

78 వ శ్లోకం 
మనుజుడు సభ్యుడు దానై
కనియున్న యదార్థమెల్ల కానిన యట్లా
మనుజుండు పలుకకున్నను
ఘనమగు పాతకము నాడు గనును కుమారా!

భావం 
ఓ కుమారా! ఉచితానుచితములు తెలుసుకొని మనిషి నడుచుకొనవలెను. తను తెలుసుకొన్న సత్యమును నిర్భయముగా చెప్పగలిగి యుండాలి. చూచిన దానిని చూడనట్లుగా పలుకరాదు. అట్లు చేసిన మిక్కిలి పాపములు అంటును.

79 వ శ్లోకం 
అంగీకార రహితమగు
సంగతికిం బోవరాదు సామాన్యుల తో
డం గడు జగడమునకు జన
వెంగలితనమంద్రు జనులు వినుము కుమారా!

భావం 
ఓ కుమారా! అంగీకారముకాని విషయముల జోలికి వెళ్ళకుము. సామాన్యులతో పోట్లాడకుము. అట్లు చేసిన జనులు నిన్ను అవివేకియందురు. ఈ విషయమును గ్రహించి మసలు కొనుము.

80 వ శ్లోకం 
ధీరుడు తనదగు సంపద
జారిన యెడ జింత నొందజాలక దా ల
క్శ్మీరమణుని వర చరణం
భోరుహములు గొలిచి ముక్తిబొందు కుమారా!

భావం 

ఓ కుమారా! ధైర్యవంతుడు తన సంపదలు పోయిననూ విచారింపడు. నిబ్బరముతో ఉంటాడు. లక్ష్మీరమణుడైన శ్రీమహావిష్ణువుయొక్క పాదపద్మములను సేవించుచూ మోక్షప్రాప్తిని పొందుతాడు.

కుమార శతకం 61 నుండి 70 వరకు శ్లోకాలు

కుమార శతకం 61 నుండి 70 వరకు శ్లోకాలు

జారులతో  జోరులతో
గ్రూరులతో నెపుడు పొత్తు గోరక మది స
త్ఫూరుష పదాంబు జాతా
ధారుడవై బ్రతుకు కీర్తి తనరు కుమారా!

భావం 
ఓ కుమారా! విటులతోనూ, దొంగలతోనూ, క్రూరులతోనూ కలసి స్నేహము చేయకుము. నిత్యము సజ్జనుల పాదపద్మములను మనసునందు నిలుపుకొని మనుగడ సాగించుము.

62 వ శ్లోకం 
జ్ఞానుల చరితము వీనుల
నానుచు సత్పురుష గోష్టి ననఘంబనుచున్
బూనుము : ధర్మపధంబును
దా నెరిగినయంత మరువదగదు కుమారా!

భావం 
ఓ కుమారా! జ్ఞానుల చరిత్రలను వినుటయును, సజ్జనుల సభలలో పాల్గొనుట వలననూ, పాపములు నశించునని తెలియుము. కావున నీ శక్తి సామర్ధ్యములున్నంతవరకూ ధర్మమును వీడక ఈ భూమియందు నడచుకొనుము.

63 వ శ్లోకం 
తన పంక్తి యందు బాంధవ
జనము లొక విధంబుగా మెసమ్గుచు నుండం
గను దా సద్రసముల మెస
గిన విషభోజన సమంబు క్షితిని కుమారా!

భావం 
ఓ కుమారా! తన పంక్తియందు కూర్చున్న బంధువులొక విధంబున తినుచుండగా తాను మధుర పదార్థములను, షడ్రసోపేతముగా భుజించుట కూడదు. తనట్లు వేరు విధమున భుజించినచో అది విషముతో సమానమగునని తెలియుము.

64 వ శ్లోకం 
పరజనులు కట్టి విడిచిన 
వర చేలములైన గట్ట వలదు వలువలన్
నెరి మాయు మడాత మార్చుచు
ధరియించుటా యొప్పదండ్రు ధరను కుమారా!

భావం 
ఓ కుమారా! ఇతరులు కట్టి విడిచిన వస్త్రములెంత విలువగలవియైననూ, ధరింపరాదు. అట్లే ఎంత విలువగలిగిన వస్త్రములనైననూ నలిగిన మడతలు కనబడునట్లు కట్టరాదు. అట్లు చేయుట ఈ భూమియందు కూడని పని.

65 వ శ్లోకం 
లోకమున సర్వజనులకు
నా కాలుడు ప్రాణహారియై యుండగ శో 
భాకృత కార్యముల వడిం
బ్రాకటాముగ జేయకుండరాదు కుమారా!

భావం 
ఓ కుమారా! లోకమునందు సర్వజనులకు హరించు యముడున్నాడని తెలుసుకొని చేయదగిన శుభకార్యముల నన్నింటిని ప్రసిద్ధముగా శీఘ్రముగా వెంటనే చేయుము. ఆలస్యము చేసినచొ పనియగుట కష్టము. అనగా ప్రాణం పోకడ వాన రాకడ ఎవరికీ తెలియనట్లే ఈ గాలిబుడగవంటి జీవితం ఎంత కాలం ఉంటుందో ఎవరికీ తెలియదు కావున దీపముండగానే యింటిని చక్కబెట్టుకొనుమన్నట్లు మహిలో మనం జీవించియున్నపుడే మంచి పనులు చేయుమని అర్ధం.

66 వ శ్లోకం 
ప్రజ్ఞావంతుని చెతను
ప్రజ్ఞాహీనునకు గడమ వాటిల్లు నిలన్
బ్రాజ్ఞత గల్గి నటించిన 
దత్‍జ్ఞు న్నుతియింతురదియు ధనము కుమారా!

భావం 
ఓ కుమారా! ఈ భూమియందు తెలివైన‍ వారి వలన తెలివి లేనివారికి కష్టములు కలుగును తెలివిగలిగి నటించిన వాని జీవితమును జూసి జనులెల్లరునూ పొగడుదురు. అదియే మానవునికి ధనము.

67 వ శ్లోకం 
గృహ దాహకునిం బరదా
రహరుం బంధుహిత కార్య రహితుని దుష్టో
త్సాహపరుని జంపి నరపతి
యిహ పరముల యందు కీర్తి నెసగు కుమారా!

భావం 
ఓ కుమారా! ఇండ్లను తగులబెట్టువానిని, ఇతరుల భార్యలను హరించువారిని, బంధువులు, హితులు మొదలగు వారి పనులను చేయక చెడగొట్టువానిని, చెడుపనులను చేయుట యందుత్సాహము కలవారిని రాజు సంహరించి ఇహపరలోక కీర్తిని పొందుతాడు.

68 వ  శ్లోకం 
జనియించుట పొలియుటకే
పెను సుఖమొందుటది కష్ట విధినొందుటకే
విను హెచ్చుట తగ్గుటకే
యని మనమున నమ్మవలయునయ్య కుమారా!

భావం 
ఓ కుమారా! మానవులు పుట్టుట గిట్టుట కొరకే ! మిక్కిలి సుఖములనుభవించుట కష్టములు పొందుటకొరకే. పెరుగుట విరుగుట కొరకేయని భావింపుము. పెద్దలు చెప్పిన ఈ సూక్తిని మరువకుము.

69 వ శ్లోకం 
కులభామల విడువకు వెలి
పొలతుల వీక్షించి మోహమును బొరలకుమీ
ఖలు డందు రెట్టివారలు
గులహీనుడు పుట్టెననుట కొఱలు కుమారా!

భావం 
ఓ కుమారా! ఎన్నడునూ నీ భార్యను విడువకుము. పరస్త్రీల వ్యామోహములో పడకుము. అట్లు చేసినచో నిన్ను దుష్టుడందురు. కులహీనుడు జన్మించెననుమాట నీ పట్ల యదార్ధమై నిలిచి యుండును.

70 వ శ్లోకం 
పాపంబులందు నెక్కుడు
పాపము సుమీ! ధరిత్రిపై క్రోధగుణం
బే పారు, లోభమును, విని
యే పురుషుల బెడద గూడ దిలను కుమారా!

భావం 
ఓ కుమారా! ఎక్కువైన కోపము, లోభము అనే గుణములు పాపములన్నింటిలోనూ మిక్కిలి పాపములు. అందుచే ఎవరికీ బాధ కలుగకుండునట్లు మసలుకొనుము.

కుమార శతకం 51 నుండి 60 వరకు శ్లోకాలు

కుమార శతకం 51 నుండి 60 వరకు శ్లోకాలు

సిరి చేర్చు బంధువుల నా
 సిరియే శుభముల నొసంగు చెలువుల గూర్చున్
 సిరియే గుణవంతుండని
 ధరలొ బొగడించునంచు దలపు కుమారా!

భావం
ఓ కుమారా! ’ధనం మూలమిధం జగత్ ’ అన్నారు పెద్దలు. మనిషికి ధనమే ముఖ్యమైనది. సంపదలు కలిగినపుడు బంధువులు తమంత తామే వచ్చి చేరుదురు. శుభములన్నియు సిరితో బాటే వచ్చును. స్నేహితులు మనదగ్గర డబ్బున్నంతవరకూ మనచుట్టూ తిరుగుతారు. ధనమువలన సుగుణములతోను, కీర్తి ప్రఖ్యాతులతోను చూడబడతాము. కావున ధనము సంపాదించుట నేర్చుకొనుము.

52 వ శ్లోకం 
తనదు కులాంగన యాలో 
చనమున మంత్రియును భుక్తి సమయంబున దా
జననియు రతిలో రంభా
వనజేక్షణ యయినఁ బుణ్యవశము కుమారా!

భావం 
ఓ కుమారా! లోకమందు పురుషునకు అనుకూలవతియైన భార్య కావలయును. ఆలోచించు సమయమునందు మంత్రివలెను, భోజన సమయమునందు తల్లివలెను, రతి సమయమునందు రంభవలెను,సేవలు చేయు భార్య పొందుట మిక్కిలి అదృష్టమనబడును. అట్టి భార్య లభించడం పూర్వజన్మ ఫలము.

53 వ శ్లోకం 
అల దేవగృహము కడప యి
రుల గోవాటముల యందు ద్రోవలలో ర
చ్చల కొట్టములను నొప్పదు
మల మూత్ర విసర్జనంబు మహిని కుమారా!

భావం 
ఓ కుమారా! దేవాలయముల వద్దను, గడపముందటను, గోశాలయందును, రహదారులయందును, నలుగురు కూర్చుండు స్థలముల వద్దను, పశువులు కొట్టములందును, మలమూత్రములను విసర్జించుట ఈ భూమిపై తగదని తెలుసుకొమ్ము.

54 వ శ్లోకం 
పాపపు బని మది దలపకు 
చేపట్టిన వారి విడువ జేయకు కీడున్
లోపల దలపకు, క్రూరుల
ప్రాపును మది నమ్మబోకు, రహిని కుమారా!

భావం 
ఓ కుమారా! మనస్సునందు పాపపు పనులను తలంపకు. భార్యపుత్రులను విడిచిపెట్టరాదు. కాపాడుదునన్న వారిని వదలివేయకుము. మనసునందెవ్వరికి కీడు తలంపవద్దు. దుర్మార్గులను మనస్సునందెక్కువగా నమ్మవలదు. ఈ పద్ధతులను తెలుసుకొని మెలగుము.

55 వ శ్లోకం 
జగడంబులాడు చోటను
మగువలు వసియించుచోట మదగజము దరిన్
బగతుండు తిరుగుచోటన్
మగుడి చనగవలయుఁ జలము మాని కుమారా!

భావం 
ఓ కుమారా! పొట్లాటలు జరుగు ప్రదేశమందును, స్త్రీలు నివసించు ప్రదేశములందును, మదించిన ఏనుగులున్న స్థానమందును, శత్రువు దిరుగు ప్రదేశములందునూ, నిలువరాదు. అటువంటి ప్రదేశములలో నివసించరాదు. శీఘ్రమే వదలిపోవలెను.

56 వ శ్లోకం 
తిరుగకు దుర్మార్గులతో
నరుగకు గహనాంతర స్థలాదుల కొంటన్
జరుగకు శత్రుల మోల
న్మరువకు మేల్ హితులయెడల మదిని కుమారా!

భావం 
ఓ కుమారా! దుర్మార్గులతో కలసి తిరుగకు. ఒంటరిగా కీకారణ్య ప్రాంతములకు పోరాదు. ఎప్పుడూ శత్రువుల పక్షము వహింపకు. నీ మంచిని కోరువారినెపుడూ మరువకు. వారికి మంచిని కలుగజేయుము.

57 వ శ్లోకం 
తరలాక్షుల యెడనెన్నడు
బర్హాసాలాపములను పచరింపకుమీ
బరికించి నిరీక్షించిన 
నురు దోషంబనుచు దలపుచుండు కుమారా!

భావం 
ఓ కుమారా! స్త్రీల పట్ల పరిహాసములెన్నడునూ చేయకు. వారిని పరిశీలనగా చూచుట, వారికొరకు నిరీక్షించుటా మిక్కిలి దోషములని ఎరుంగుము.

58 వ శ్లోకం 
కాయమున నాటు శరములు
పాయంబున దీయవచ్చు బహునిష్ఠురతన్గూ
య మదినాటు మాటలు
పాయవుగా యెపుడు నెగడు పరచు కుమారా!

భావం 
ఓ కుమారా! శరీరమునకు నాటిన బాణమును ఉపాయముతో తీయవచ్చు. కాని మనసున నాటిన మాటలు మానసిక వ్యధను కలుగజేయును. అటువంటి కఠిన మాటలను వెనక్కు తీసుకొనుట కష్టం. అవి మనస్సును బాధించును.

59 వ శ్లోకం 
పెనుకోపము గర్వము ను
బ్బును జపలము దురభిమానము నిర్వ్యాపారం
బునుఁ జొరవు నునికియును న
ల్పుని గుణము లటంచు దెలివిబొందు కుమారా!

భావం 
ఓ కుమారా! మిక్కిలి కోపము, గర్వము, మానసిక చాంచల్యము, పొంగిపోవుట, గర్వపడుట, పనిలేకుండుట, చురుకుదనములేకుండుట, మొదలగునవి అల్పుని గుణములని తెలుసుకొనుము. ఈ గుణములను నీ దరి జేరనీయకుము.

60 వ శ్లోకం 
విత్తము గూర్చిన మనుజుం
డుత్తమ దానంబు భోగమొందని యెడ భూ 
భృత్త స్కర శిఖి గతము వి
వృత్తికంబగును నట్టి పదవి కుమారా!

భావం 
ఓ కుమారా! మనిషి ధనమును ఎక్కువగా కూడ బెట్టవలెను. అట్లు ఐశ్వర్యవంతుడైనవాడు దానము జేయుచు, భోగములను అనుభవింపవలెను. తాను దినక , తనవారికి పెట్టక కూడబెట్టిన ధనము చివరకు రాజులపాలో, దొంగలపాలో, అగ్నిపాలో కాక తప్పదు. అటువంటి స్థితిని బొందకుము.

కుమార శతకం 41 నుండి 50 వరకు శ్లోకాలు

కుమార శతకం 41 నుండి 50 వరకు శ్లోకాలు

నరవరుడు నమ్మి తను నౌ
కరిలో నుంచునెడ వాని కార్యములందున్
సరిగా మెలంగ నేర్చిన
పురుషుడు లోకమునఁ గీర్తిఁ బొందుఁ గుమారా!

భావం 
ఓ కుమారా! యజమాని నిన్ను నమ్మి ఒక పనిని అప్పగించినపుడు, ఆ పనులను శ్రద్ధతో చక్కగా చేయుము. అట్లు చేసినచో నీకు లోకమునందు మిక్కిలి కీర్తి సిద్ధించును.

42 వ శ్లోకం 
ధరణి నాయకు రాణియు
గురు రాణియు నన్న రాణి కులకాంతను గ
న్న రమణి దనుగన్నదియును
ధరనేవురు తల్లులనుచుఁ దలుపు కుమారా!

భావం 
ఓ కుమారా! భూమియందు ప్రతి ఒక్కరికినీ అయిదుగురు తల్లులుందురు. కన్నతల్లి, యజమాని భార్య,గురుపత్ని, అన్నభార్య(వదిన) భార్య తల్లి (అత్త). ఈ ఐదుగురు గూడా తల్లులనియే భావింపుము.

43 వ శ్లోకం 
ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయఁ బోకుము కార్యా
లోచనము లొందఁ జేయకు

మాచారము విడవఁ బోకుమయ్య ! కుమారా!

భావం 

ఓ కుమారా! గురువును ధిక్కరించకు, నిన్ను పోషించు యజమానిని నిందింపరాదు. చెయుపనియందు శ్రద్ధ వహింపుము. పెద్దలు నడచిన పద్ధతిని విడువరాదు.

44 వ శ్లోకం 
నగం గూడదు పరసతిఁ గని
తన మాతృ సమనమెన్నదగు; నెవ్వరితోన్ఁ
బగ గూడ, దొరల నిందిం
పగఁగూడదు, గనుము వృద్ధ పధము కుమారా!

భావం 
ఓ కుమారా! ఇతరుల భార్యలను చూసి నవ్వరాదు. వారిని కన్నతల్లితో సమానముగా జూడవలయును. ఎవ్వరితోను విరోధము పెట్టుకొనరాదు. ఇతరులను దూషింపరాదు. పెద్దలు ఈ పద్ధతినే అనుసరించిరని తెలియుము.

45 వ శ్లోకం 
చేయకుము కాని కార్యము
పాయకుము మఱిన్ శుభం బవని భోజనమున్
జేయకుము రిపు గృహంబున 
గూయకు మొరుమనసు నొచ్చుకూత కుమారా!

భావం 
ఓ కుమారా! చేయకూడని చెడ్డపనులను చేయకుము. శుభకార్యములను విడువరాదు. శతృ గృహములయందు భోజనము చేయరాదు. ఇతరులమనస్సులను బాధించు మాటలు మాట్లడరాదు.
ఓ కుమారా!సిరి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి మనసును ఆకర్షించినవాడును, ఐశ్వర్య భోగభాగ్యములను దయతో ఇచ్చు స్వభావము కలవాడును, నాభియందు పద్మము కలవాడును, అయిన విష్ణుమూర్తి, సంపదలనిచ్చే శ్రీ హరిని ప్రార్ధించుచున్నాను.

46 వ శ్లోకం 
పిన్నల పెద్దల యెడఁ గడు
మన్ననచే మలగు సుజన మార్గంబుల నీ
వెన్నికొని తిరుగుచుండిన
నన్ని యెడల నెన్న బడదువన్న కుమారా!

భావం 
ఓ కుమారా! పిన్నపెద్దల పట్ల కడు గౌరవముతో మెలగుము. నీవు మంచిపద్ధతుల యెన్నుకొని ప్రవర్తించినట్లయితే అన్నింటా నీకు శుభమే కలిగి మంచి పేరు ప్రఖ్యాతులను బడయగలవు.

47 వ శ్లోకం 
బూటకపు వర్తనము గని
జూటరి వీడనుచుఁ దప్పఁ జూతురుగా! యా
బాటను విడి సత్యము మది 
బాటించి నటించు వాడె నరుడు కుమారా!

భావం 
ఓ కుమారా! అసత్యమైన బూటకపు నడవడికను మానుకొనుము. దానివలన నీవు అబద్ధములాడువాడని నిన్ను తప్పుగా చూస్తారు. ఆ చెడుమార్గమును వీడి సత్యమును బాటించి మనిషిగా మసలుకొనుము. నీవు సత్యమార్గమున ప్రయాణించినచో నిన్ను లోకులు సత్యవర్తనుడని పొగడుతారు.

48 వ శ్లోకం 
లోకులు తనుఁ గొనియాడ వి
వేకి యదియు నిందగాక విననొల్లడు సు
శ్లోకుల చరితం బిట్టిది
చేకొనవలె నట్టి నడక చిన్ని కుమారా!

భావం 
ఓ కుమారా! పండితులు పొగడ్తలకు పొంగిపోరు. ప్రజలు నిందించినపుడెట్లు మనము విననట్లుందుమో పొగడునప్పుడు తెలివికలవాడు పొగడ్తలను వినరు. ఇదియే సుజ్జనుల పద్ధతి. దీనిని గ్రహించి నీవు కూడా మంచి నడత అలవరచుకొనుము.

49 వ శ్లోకం 
వగవకు గడచిన దానికి
పొగడకు దుర్మతుల నెపుడు; పొసగని పనికై
యొగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!


భావం 
ఓ కుమారా! జరిగిపోయినదానికి విచారించకు. దుర్మార్గులను ఎప్పుడునూ పొగడ రాదు. చేయలేని పనికి చింతింపరాదు. ఈ భూమియందు పనులన్నియు భగవంతుని నిర్ణయము ప్రకారమే జరుగునని తెలుసుకొనుము. తగని పనులను చేయకుము.

50 వ శ్లోకం 
బరులెవ్వరేని దనతో 
బరిభాషించినను మేలు పలుక వలయు నా
దరము గల చోటఁ గీడు
న్గరము నొనర్పంగరాదు గదర కుమారా!

భావం 

ఓ కుమారా! ఇతరులతో మాట్లాడునపుడు మంచినే పలుకవలయును. నిన్నాదరించిన వారికి కీడు తలపెట్టకు. ఈ సన్మార్గములను తెలుసుకుని నడుచుకొనుము.